వారి పాపాలు ప్రసవించిన పసికందును నేను
తిమిర సమాజం విసిరేసిన విరి మొగ్గను నేను
విరించి వలువపై రుధిర మరకను నేను
కర్మభూమి భావి పౌరుణ్ణి నేను
తిండిలేదు గుడ్డలేదు తలదాచుకోను నీడలేదు
నీలాగే ఆకలి దప్పికలున్న మనిషిని నేను
ఏనాడు అరగడుపైన నిండలేదు
ఎముకలు కొరికే చలి నానేస్తం
ఎర్రనైన ఎండ నా చుట్టం
వానేమో వళ్ళు కడిగే తోబుట్టువు
నేలతల్లి లాలించే అత్మబంధువు
నేనుసైతం అశ్రు జలధిని ఆరగిస్తాను
తిరగబడ్డ జాతి కరమున వాలమవుతాను
నడినెత్తిన సూర్యుడిలా ఆవిర్భవిస్తాను
నిశాచరుల నాయకత్వాన్ని నిలదీస్తాను
ననుజూసి నవ్వకోయి
సిగ్గులేని నాయకుడా...
ఎదుగుతున్నాను ఎరుపెక్కిన గగన గర్భంలో
ఎదురుచూడు నా కోసం నీ ఆఖరి గడియల్లో...