Wednesday, 21 June 2017

నిరాశ నీడలో నీకోసం బ్రతికున్నా ...


నువ్వెక్కడున్నా నీతోనే నేనున్నా
నీలోని ప్రతి అణువు నేనే అనుకున్నా
నిరాశ నీడలో నీకోసం బ్రతికున్నా
నెలవంక సాక్షిగా నేలా నింగి నడుమ

కోయిలమ్మ పాడుతోంది
నీ పలుకులను నెమరేస్తూ
నా గుండెను పిండుతోంది
కొన ఊపిరి లాగేస్తూ

మరుపన్నది లేకుంటె
మనిషి బ్రతుకు నరకమే
మది మెచ్చిన తోడుంటే
మహాప్రస్థానమైనా మధురమే

తెలియ్తలేదు నాకు
తెరచాప తొలగిందని
ఉసురు తీసే కడలిలో
ఒంటరినైపోయానని

Friday, 16 June 2017

మనిషి మనిషికొ దేవుడాయె...


చరిత సారమంతా
పరపీడన కథలాయె
బంగారు భరత భూమి
బానిసల నెలవాయె

మానవజాతి ఒక్కటే అయినా
మనిషి మనిషికొ దేవుడాయె
మతాల మారణహోమంలో
మానవత్వం బూడిదాయె

అన్నదమ్ముల నడుమ
ఆరని చిచ్చు రగిలె
ఒక్కటిగా ఉన్న జాతి
ముక్కలుగా విడిపోయె

దేవుళ్ళ ముసుగుల్లో
దెయ్యాల కొలువాయె
దీనుల జీవితాలు
దిన దిన గండమాయె

Saturday, 10 June 2017

అనురాగ రాగమై ....



నింగి నేల కలిసే చోట
నీ రాకకోసం వేచి వున్నా
ఎదురుచూపులవేడిలో
ఎడద కరిగిపోతున్నా

చల్ల గాలి చెబుతోంది
నీ ఊసులెన్నో
మౌనంగా పంచుకున్న
మన బాధలెన్నో

కరిగిపోని కలవై
నాకళ్ళళ్ళో నిలిచిపోవా
అనురాగ రాగమై
కలకాలం మురిపించవా 

Thursday, 8 June 2017

రుధిర ఋణానుబంధాలనైనా....


తేనె పలుకుల పలకరింపులు
తెర వెనుక గోతులు
ఎదుట మదిగెలిచే మాటలు
ఏరుదాటాక వెక్కిరించే నక్కలు

రెప్పపాటు కాలంలో
రూపాలెన్నో మార్చే నైపుణ్యం
రుధిర ఋణానుబంధాలనైనా
రూపాయితో కొలిచే దానవగుణం

ధనార్జన దాహంతో
జనార్ధనుడినే మోసగిస్తారు
సుఖ సంపాదనల వేటలో
సగటు మనిషిని వదిలేరా... 

Thursday, 1 June 2017

కలల మేఘాల వెనుక...

పరుగిడకే మనసా
కలల మేఘాల వెనుక
కురిసే ప్రతి చినుకూ కావాలంటూ
మెరుపు కాంతిలో సందడిజేస్తూ

పసిడి పలుకుల తళుకుల్లో
పరవషించిపోతావు
పడగ విప్పి బుసగొట్టిన రోజు
పండుటాకులా వణికిపోతావు

చిన్ని చిన్ని సంతోషాలు
చిలిపి తగవుల చిరునవ్వులు
చెరిగిపోయే అనురాగాలు
చేదు అనుభవాల జ్ఞాపకాలు

ఇవేనా నీ ఆరాటాలు
ఇంతేనా అనుబంధాల లెక్కలు

Thursday, 18 May 2017

కడదాక తోడొస్తావా నేస్తం....






నవ్వే నీ కళ్ళు నావె
నవరాగాల నీ పలుకులు నావె
జిలిబిలి తగువులు నావె
జీవన సమరాలూ నావె

జతగా వేసిన అడుగుల్లో
జడివానల మజిలీలెన్నో
జగమంతా దగాచేసినా
జడవక నిలిచిన క్షణాలెన్నో

మలిసంధ్యల చీకట్లో
ముసురేసిన మబ్బుల్లో
కడదాక తోడొస్తావా నేస్తం
కలిసి చేరుకుదామా మరో లోకం

గగనపు వీధుల్లో విహరిస్తూ
మరుజన్మల ఊహల్లో తేలిపోతూ

Wednesday, 10 May 2017

మల్లెల మనసుల మధుర స్వప్నం....


చేయి చేయి కలిపి నిర్మిద్దాం
నేతాజి కలల నవలోకం
మల్లెల మనసుల మధుర స్వప్నం
మహాత్ముని మరో ప్రపంచం

అందాలు ఆరబోసిన అపరంజి సౌధమది
ఆకలి కేకలుండవు
జిలుగు తారల వెలుగు సంద్రమది
అసూయా ద్వేశాల కానరావు

వేటాడే నాయకుల వెర్రిచేష్టలుండవు
కళ్ళల్లో కసాయి కుర్రతనముండదు
నిర్భయ నైమిశ రోదనలుండవు
వెట్టి చాకిరీ వ్యధల బాల్యముండదు

మతకలహాల మారణహోమం మానుకుందాం
మనీషి లా మానవత్వాన్ని చాటుకుందాం