Monday 10 April 2017

ఒంటరిగా పోరడనివ్వు నా ఊపిరాడేవరకు ....


నీకు పట్టనట్టే మసలుకోరా
వగచే జీవితాలు వల్లకాడుజేరేవరకు
నరమేధం జరుగుతున్నా ముసుగుదన్ని నిదురపోరా
వేదన పక్క వాడిది కదా వులికిపాటు నీకెందుకు

మలి వరసలో నీవున్నా
మరో రోజు నీ వంతైన
ఆదుకోవడానికి వున్నారుగా
నువు ఆరాధించే దేవుళ్ళు

పైవాడి పై భారమేసి
ప్రతిఘటన ఊసెత్తకు
పెరుగన్నం నైవేద్యం పెడితే రాడా
పరుగులు పెడుతూ పెరుమాళ్ళు

దీటైన దానవులను వోటేసి ఎన్నుకో
దమన దహనకాండలో సమిధవై వెలిగిపో
ప్రళయ మారుతంలో గడ్డి పరకవై ఎగిరిపో
ప్రశ్నించే గుణం మరచి చరిత్రలో కలిసిపో

గంటకో గండం తలుపుతడుతున్నా
గొంతు విప్పే శ్రమ నీకెందుకు
నాతో చేయి కలపకురా చేవజచ్చిన నేస్తమా
ఒంటరిగా పోరడనివ్వు నా ఊపిరాడేవరకు

No comments:

Post a Comment

Please provide your feedback here.....