Thursday, 29 October 2015

నా శూన్య బంధాలు...

నువ్వెన్నిసార్లు నయవంచన చేసినా నమ్మటమే నాకు తెలుసు 
నీ చిరునవ్వు కోసం మోసపోవడంలోని సుఖం నీకేం తెలుసు... 
అనుబంధాలు ఆవిరై పోతాయని తెలిసినా అనుక్షణం ఆరాటమే....
                        ఆత్మీయతల నడుమ అలుపెరుగని పోరాటమే...
నింగికెగసే వరకు తెలియదు నేలవిలువెంతో...
                                                             వియోగ వేదనేమిటో...
మాడిపోతానని తెలిసినా మిణుగురుకు మంటలంటెనే మక్కువ...
                              మారిపోయె మనుషులకు మమతానుబంధాలంటే లోకువ...
సెలయేటికి స్వార్థముందా నేస్తం..... గల గల పారే గుణమేగాని.... 
                                చిరుగాలికి  పర  సేవలోనే సుఖం... ప్రతిఫలం రాకపోని...
పంచభూతాల ప్రతిరూపమే నేనైనప్పుడు.. క్షణిక తాపాల తిమిరం నాకెందుకు...
అణువణువున  అలుముకున్న అనురాగ సంపద నాది కాదా... నీది కాదా..
పంచే గుణమే మనదైతే ప్రపంచమే మనది కాదా... మనసు పరవశించిపోదా....

Tuesday, 20 October 2015

గుర్తున్నానా నేస్తం...

బ్రతుకు పుస్తకం తెరచిచూడు బాల్య పుటలలో నేనుంటాను...
కలసిరాని కాలాన్ని తరచి చూడు మరువకూడని స్థానం లో కనిపిస్తాను....
కరుణించిన కలిమి నిన్ను కనకపు సిం హాసనమెక్కించింది...
కలుషిత నాగరికత మిన్ను కెగసి గడచిన నీ గతాన్ని మరిపించింది..
ఆర్థిక అంతరము చిన్ననాటి చెలిమిని నిర్దయగా నలిపేసింది... 
అభివృద్ది అహ్లాదమేగాని  నిరాదరణ నిందనీయం...
కలిమి చంచల గమని... చెలిమి తరగని గని...
నేడన్నది నీదైనట్లే... రేపన్నది నాదేమో...
ఏ నాడు ఎవరిదైనా మనదేనని భావించనపుడు... మన జీవితాలు వృధానేమొ...  
ఆత్మీయత అనే పదానికి  అర్థం నీ నిఘంటువులొ తప్పుగావుంది నేస్తం...
అనుబంధాలు సరిచూసుకో... అర్థ భరిత గణితాలు సరిచేసుకో...
ఘటనుంటె  మళ్ళీ కలుస్తాను... గడువైతె వెళ్ళిపోతాను... పుటలలో మిగిలిపోతాను...

Tuesday, 13 October 2015