Saturday 28 May 2016

ఓదార్చలేదు... ఒడిచేర్చుకోదు..

కళ్ళముందు నీ రూపం కరాళనృత్యం చేస్తోంది
పిడికెడు గుండెలో ఎగసిపడే రుథిర కెరటంలా
తలచి వగచే నా మది తిరిగిరానంటోంది
నీ జ్ఞాపకాల వలలో చిక్కి, కపోతంలా... 

పగలేదో రెయేదో ఈ ఎడరి రహదారిలో
కలయేదో నిజమేదో నీ తలపుల తిమిరంలో
రాగాలకు అనురాగాలకు చోటెక్కడ ఒంటరి పయనంలో
రవి కిరణం జాడెక్కడ గతితప్పిన జీవితంలో

అల ఎంత ఆరాటపడినా గగనాన్ని తాకలేదు
దిశ తెలియని పరుగు దరిని చేర్చలెదు
కొడిగట్టిన దీపం వెలుగు పంచలేదు
నలుగుతున్న నామనసును ఏ పలుకూ ఓదార్చలేదు... ఒడిచేర్చుకోదు..  

Thursday 19 May 2016

నీ రాక కోసం ...

నడి రాతిరి వెన్నెల్లో వణికించే ఈ చలిలో..
కనులెలా మూసేది... కలలనెలా ఆపేది...
జ్ఞాపకాల కెరటాలు అలజడి చేస్తోంటే
నీ నవ్వునెలా మరిచేది...మనసునెలా దారి మళ్ళించేది..

నీలి గగనంలో తారవై దూరమయ్యావు
నిన్నల నీడలలో కలిసిపోయావు కానరాని తీరంలా...
తెలియని తామస తిమిరం తనువును కాల్చేస్తోంది..
కళ్ళెదుట నీ రూపమె కనిపిస్తోంది..

తెరమరుగైన తలపులు హృది తలుపులు తడుతోంటె
తడి నేత్రాలు నీ రాకకోసం ఎదురుచూస్తున్నాయి
ఎంతకీ తరగని ఈ అంతుతెలియని పయనం ఏ తీరాలను చేరుస్తుందో
ఎదురుచూసే కళ్ళకు నీ మిసిమి దరహాసమెరుపు కనిపించేదెపుడో...

నా మది మౌన రోదన నీ హృది జేరలేదా నేస్తం...
ఎడారిలో క్షత కపోతంలా ఎదురుచూస్తున్నా నీ రాక కోసం ...

Saturday 14 May 2016

అవనిని గన్న అతివ...

తప్పటడుగుల నాడు తల్లిదండ్రుల అదుపాజ్ఞల్లో
కమనీయ బాల్యాన్ని బలిపెట్టుకున్నావు నిరాశా నీడల్లో
ఒదిగి నలిగావు నీదన్నదేమిటో తెలియకుండా
అమ్మానాన్నల వివక్ష ధొరణికి బదులుచెప్పకుండా...

కీచకుల కిరాతకానికి తలవంచావు కలలుగనే వయసులో
సాంప్రదాయాల సాక్షిగా ముడిబడిపోయావు మూడుముళ్ళ బంధంలో
కని పెంచావు వంశవృక్షాన్ని కన్నీటి క్షీరామృతంతో
కరిగిపోయావు కొవ్వొత్తివై కనికరమెరుగని కాలప్రవాహంలో

వయసుడిగిన మలిసంధ్యలోనైనా కాలం నీతో కలిసిరానంది...
ముడులేసిన చేయి దివి చేరుకుంది..
బొడ్డు తెంచుకున్న బంధం వీధిపాల్జేసింది...
వక్రించిన విధి వెక్కిరిస్తోంది.. వేగిపొమ్మంటోంది..

Saturday 7 May 2016

అల్లూరి విల్లు నేలకొరిగిన రోజు...








అవని ఒడిలో విప్లవ కేసరి కలిసిపోయిన రోజు
తెల్ల దొరల కుటిల నీతికి నేల తల్లి తల్లడిల్లిన రోజు
తెలుగు బిడ్డ రక్తంతో భరతమాత తిలకం దిద్దుకున్న రోజు...
అల్లూరి విల్లు నేలకొరిగిన రోజు...సీతారామరాజు తరలిపోయిన రోజు...

వీర కేసరిని విస్మరించిన నల్ల దొరలకు గుర్తుచేద్దామా...
విలువలెరుగని కపట నాయకులను తరిమిగొడదామా...   
విగత వీరుని స్మరణలో రుధిర భాష్పం ధారపోద్దామా...
చరణ ధూళిని తలనురాసుకుందామా...   ధరణి దద్దరిల్లేలా జేజేలు కొడదామా..