Thursday 27 October 2016

చెమ్మగిల్లిన కళ్ళు చూపునాపుతున్నా....

తన తనువున భాగంగా
తొమ్మిదినెలలు నిను మోసి
కడుపున నీ కదిలికలకు
మురిసిపోయి మైమరచిపోయింది

తన్నే నీ కాళ్ళను
తనివితీరా ముద్దాడి
కమనీయ అనుభూతిని
కళ్ళల్లో దాచుకుంది

ప్రసవ వేదనను పంటిబిగువున దాచి
ప్రపంచానికి నిన్ను పరిచయంజేసింది
నీ మేను నేల తాకిన క్షణాన
పురిటి బాధను మరచి పరవశించింది

చెమ్మగిల్లిన కళ్ళు చూపునాపుతున్నా
రెప్పవాల్చకుండా రేయంతా నినుజూస్తూ 
నింగినేలే నెలవంక నీకు సాటిరాదంటూ
కనిపించని దేవతలకు కరములుజోడిస్తూనేవుంది

కనికరానికి కృతజ్ఞతలంటూ
కలకాలం నిను కాపాడమంటూ.... 

Friday 21 October 2016

సంకెళ్ళు పసిడివని పరవశిద్దామా నేస్థం...



నీతిమాలిన నేతల కడుపులు నింపడానికి
నేలతల్లిని తొలచి నెత్తుటితో పైరుదడిపి
రేయనక పగలనక కంట ఒత్తులేసుకొని పంటగాపుగాసి
విపణివీధికి వెళితే కరమునిండని విత్తము వెక్కిరించె 

మదమెక్కిన నాయకుల చెతుల్లో
మదిర పాత్ర విలువజేయని మట్టి జీవితాలు
రెక్కాడినా డొక్కాడని కష్టాల్లో
ఏరులై పారుతున్న రైతన్న కన్నీళ్ళు


తెల్లోడి పాలనలో తరగని సిరి తరలిపోయె
మనవాడి పడగ నీడలో మింగ మెతుకైనా కానరాదాయె
దొరల రంగు మారినా దురిత నీతి ఒక్కటే
సామాన్యుడి జీవితమంతా కష్టాల చీకటే

సంకెళ్ళు పసిడివని పరవశిద్దామా నేస్థం...
చేవతో చెలిమిజేసి చేరుకుందామా మరోప్రపంచం..

Saturday 15 October 2016

ఎదుగుతున్నాను ఎరుపెక్కిన గగన గర్భంలో...

మత్తెక్కిన నేతల మలిన గాధను నేను
వారి పాపాలు ప్రసవించిన పసికందును నేను
తిమిర సమాజం విసిరేసిన విరి మొగ్గను నేను
విరించి వలువపై రుధిర మరకను నేను

కర్మభూమి భావి పౌరుణ్ణి నేను
తిండిలేదు గుడ్డలేదు తలదాచుకోను నీడలేదు
నీలాగే ఆకలి దప్పికలున్న మనిషిని నేను
ఏనాడు అరగడుపైన నిండలేదు

ఎముకలు కొరికే చలి నానేస్తం
ఎర్రనైన ఎండ నా చుట్టం
వానేమో వళ్ళు కడిగే తోబుట్టువు
నేలతల్లి లాలించే అత్మబంధువు

నేనుసైతం అశ్రు జలధిని ఆరగిస్తాను
తిరగబడ్డ జాతి కరమున వాలమవుతాను
నడినెత్తిన సూర్యుడిలా ఆవిర్భవిస్తాను
నిశాచరుల నాయకత్వాన్ని నిలదీస్తాను

ననుజూసి నవ్వకోయి
సిగ్గులేని నాయకుడా...
ఎదుగుతున్నాను ఎరుపెక్కిన గగన గర్భంలో
ఎదురుచూడు నా కోసం నీ ఆఖరి గడియల్లో...

Friday 7 October 2016

తరుణి విలాప తరుణంలో తోడురానందా...

మాట నేర్చిన మృగాల వనాలు
మలినమైన మానవతా విలువలు
అదుపుదప్పిన యువకెరటాలు
అరుణ కిరణ సాక్ష్యంగానే అతివలపై దాడులు

ఎటుచూసినా మోసాలె
బాధితుల అక్రోషాలే
సమాన హక్కుల సమరాలే
స్వార్థపరుల విజయ ఘోషలే

చీకటి మాటున తెచ్చుకున్న స్వాతంత్ర్యం
చీకట్లోనే కలిసిపోయిందా..
తరతరాల భరతజాతి సంస్కారం
తరుణి విలాప తరుణంలో తోడురానందా...