Monday 25 July 2016

నిరాశకు చోటివ్వకు నేస్తం...

నీలా నేనెప్పుడూ కృంగిపోలేదు
       కనికరంలేని కాలం నాకాళ్ళను కత్తిరించినా
నాకంట తడి కానరాదు
            నావాళ్ళంటూ నాకెవ్వరూ లేకపోయినా...

చిన్ని చిన్ని కలతలకే చిరాకు పడిపోకు
                                  పడిలేచే కెరటం నీవు...
ఆకాశం అందలేదని అప్పుడే దిగులు పడకు
                     అన్నీ ఒక్కరోజులోనే జరిగిపోవు...

నిరాశకు చోటివ్వకు నేస్తం...
                    వక్రించిన విధి ఎంత ఉసిగొలిపినా...
నేలకొరిగిపోకు రుస్తం
                           రుధిరప్రవాహం ఆగకున్నా...

Monday 18 July 2016

చావునెదిరించే చేవ లేకపోయినా....



మాట నేర్చిన మనిషి జాతి వివక్షతతో దిగజారి పోతూంటే
మానవత్వాన్ని మరచి మారణహోమం సాగిస్తూంటే
మలిన ఆలోచనలతో సాటి మనిషినే మట్టుబెడుతూంటే
మదిర మైకంలో వావివరసలే మరచిపోతూంటే

మాటలు రాని మృగం పాఠాలు చెబుతోంది
మనకన్నా తనే నయమని
          తనను మనతో పోల్చవద్దని
పరజాతి ప్రాణినిసైతం అక్కునజేర్చుకుంటోంది
తనువు శాశ్వతం కాదని
           తామసాన్నిక దరిజేరనివ్వనని

జవసత్వాలుడిగినా నీ జాత్యహంకారం చావదేమిటి
చరిత్రలెన్ని చదివినా మతచాందసం మానవెందుకు
చావునెదిరించే చేవ లేకపోయినా చంపాలన్న తపనెందుకు
చివరి నిమిషం వరకు చిత్తమంతా విత్తమే ఎందుకు... 

Monday 11 July 2016

నాతో కలిసిరావెందుకు నేస్తం ...




నింగికెగసిపోదమంటె నాతో కలిసిరావెందుకు నేస్తం
నిర్మిద్దామంటే నిర్మలమైన మరో ప్రపంచం
నీ సొంతమనుకుంటున్న ఈ అనుబంధాలన్నీ క్షణికం     
ఇది మెరుపు కలంతో దేవుడు రాసిన శిలాశాసనం...

రాక్షస సైన్యం రభస చేసే రాజ్యం మనకెందుకు
రమణీయమైన రసమయ అనురాగ చంద్రిక దరిజేరమంటూంటే
కళేబరాలతో కుళ్ళిపోయిన కుహనా ప్రపంచంలో విహరిస్తావెందుకు
సుమధుర పరిమళ నందనానందము నీకై ఎదురుచూస్తూంటే

ఒకనాడు వెండితెరపై వెలుగులు విరజిమ్మిన తారలు
ఒక్కొక్కురుగా కనుమరుగై దివిజేరిన క్షణాలు
తళుకు బెళుకులు శాశ్వతం కాదని మనకుజెప్పే నిజాలు
క్షణిక సుఖాలకై అర్రులుచాచే అమాయకులకు హెచ్చరికలు

Monday 4 July 2016

మిగిలున్నది చాలా కొంచెం...

బాల్యమంతా ఆటపాటల సందళ్ళు
యవ్వనంలో కలల కౌగిట బందీలు
ఆయువు తీరేనాటికి అనుతాప శోకాలు
తెలియనేలేదు ఎలా కరిగిపోయాయో రోజులు

ఎండమావి నీరుకోసం ఏళ్ళతరబడి ప్రయాణాలు
మలిసంధ్య చీకట్లో మసకబారిన చరిత్రలు
గడిచిపోయిన గతంలో గానరావు గనమైన గడియలు
నెమరేసుకుంటే మిగిలేది నైమిశ నిస్పృహలు

పక్కవాని కష్టం పంచుకో నేస్తం
కరిగిపోయే హిమ ఖండము నీ జీవితం
చక్కనైన చెలిమికి చాలు చిరుమందహాసం
నిరాశా జీవికి నీ ప్రియమైన పలుకే అభయ హస్తం

మరలిరాని లోకాలకు పయనమయ్యే జీవితాలు
మరో అవకాశం కోసం పరితపించే ప్రాణాలు
సమయాన్ని గౌరవించు నేస్తం...
ఇక మిగిలున్నది చాలా కొంచెం...