Friday 30 September 2016

గుండె పగిలేలా ఏడ్వు నేస్తం...

అక్కునజేర్చుకునే తోడుకోసం
అలమటిస్తోంది అలసిన మానసం
ఓదార్చలేకుంది ఒంటరి లోకం
గొడవపడుతోంది తుంటరి తామసం

నింగినంటుతున్న నిశ్శబ్ద శబ్దాలు
ఎద లోయల అగాధంలొ అగ్నిపర్వతాలు
మదిని మరగించే గత జ్ఞాపకాలు
కనిపించని రుధిర జలపాతాలు

గుండె పగిలేలా ఏడ్వు నేస్తం
వదలి వెళ్ళిన హృదికి వినబడుతుందేమో
వెచ్చని కన్నీటి ప్రవాహం
మనసు గాయాన్ని మాన్పుతుందేమో     

Thursday 22 September 2016

నా ఉనికే నీ అమ్మతనానినికి అవమానమమ్మా

ఆకలిమంటల ఉదరసెగ నాది
అమ్మల కడుపులు నింపలేని అసమర్థత నాది...
ఏడు దశాబ్దాల స్వాతంత్ర్యం నాది
ఎదలోయల్లో అణిగిఉన్న అత్మఘోష నాది

మదమెక్కిన నేతల మహిషమకుటం నాదే...
మత్తువదలని అమాత్యుల మదిర కలశం నాదే...
భరతఖ్యాతి వారసత్వము నాదే..
భారమైన బానిస బ్రతుకూ నాదే...

నీ నైమిశ రోదనకు కారణం నేనేనమ్మా
నా ఉనికే నీ అమ్మతనానినికి అవమానమమ్మా

Friday 16 September 2016

కడుపుజేత బట్టుకొని కడలి దాటొస్తె


Indian maid whose hand chopped off by Saudi employer returns home


కడుపుజేత బట్టుకొని కడలి దాటొస్తె
కనికరంలేని రక్కసులు కరమునరికారు  
దిక్కుతెలియని దేశంలో
దానవ క్రీడకు బలిజేశారు

మానవమృగాల వలయంలో
మతిచెడిని ప్రతి పడతి
మన మాతృహృదయ ప్రతిరూపంకాదా
మానవత్వానికి మనుగడేలేదా

కలకంఠి కన్నీటి తరంగం
మనిషి ఉనికినే ముంచెయ్యదా...

Saturday 10 September 2016

ఏదేశమేగినా...

అందాల గంధాలు పూసుకొని 
అవని ముంగిట వాలింది అరుణకిరణం 
విరిగొమ్మల గుబురునుండి
వీనులకు విందుజేస్తోంది కోకిలమ్మ గీతం

మనసును మురిపించే కలరవాల కలకలలు
తొలిసందె రంగుల్లో గిలిగింతల సరిగమలు
పరుగులుదీసె పల్లెపడుచుల అందెల రవళి
పరవశంతో పైకెగసిన పుడమి ధూళి

ఏదేశమేగినా ఎంత విహరించినా
కనిపించునా మనపల్లె కమనీయ అందాలు
కలిమిలేములంటని రమణీయ బంధాలు

Friday 2 September 2016

తెలవారితే కలచెదరిపోతుందేమో...


నడిరేయి వేళలో నేలంతా పరుచుకుంది  
పసిపాప పాలనవ్వులా నిండుపున్నమి పండువెన్నెల
నయనాలకందని మలయమారుతం మెలమెల్లగా కదలి
పరిమళాల పూరెమ్మతో తనువును తాకుతోంది

అవని అందాలు అస్వాదిస్తూ కనుమూయనా
నీలాల మేఘపానుపుపై ఆదమరచి నిదురించనా  
గంధర్వ నేస్తాన్ని తోడుదీసుకుపోనా
గగనపుర వీధుల్లో విహరించిరానా

తెలవారితే కలచెదరిపోతుందేమో
తిలకించిందిచాలు ఉదర ఘోష గమనించమంటూ
తెరచాటు దినచర్య తరుముకుంటుందేమో
తిమిరంతో సమరం మళ్ళీ మొదలయ్యిందంటూ......