Thursday 28 April 2016

నీ ఒడిలో పసిపాపనై..

గల గల మాటల నీ ఒరవడి
నేల  చేరిన చినుకు చేసే సవ్వడంతమధురం...
గాలి పొరలలో తేలిపోయే జలతుంపర తాకిన అనుభవం...
సెలఏటి అలల శ్రావ్య గీతం...

నీకంటి కాటుకనై కలల లోకాన్ని ఏలుకోనా..
కురుల తెరల చాటున విరినై ఒదిగిపోనా..
నీ చూపుల కెలవులో కలిసిపోయి కాలాన్ని మరచిపోనా
సౌందర్య సాగర లాహిరిలో కడదాకా తేలియాడనా..

కరిగిపోనా వాలిన నీ కనురెప్పల బిడియాన్నై
కవ్వించనా కెంపైన మోవిపై మిసిమి దరహాసాన్నై
కలహించనా నీ ముగ్ధ మనోహర రూపాన్ని చూపే అద్దాన్నై...
కనుమూయనా వలపుల నీ ఒడిలో పసిపాపనై...  

Monday 18 April 2016

చిరునవ్వుల చినుకు ....

మేఘాల అలలపై సాగిపోదామా...
మెరుపు తీగల ఊయలలూగుతూ తేలిపోదామా...
నేలనుచేరే చినికుతో కలిసి తడిసిపోదామా...
గాలి తెమ్మెరలు తాకుతూంటె మురిసిపోదామా...మై పరచిపోదామా...

చిటపటల సవ్వడి చెవితాకుతూంటే
తుంపరల తడి గిలిగింతలు పెడుతూవుంటే
తెలియని ఆనందమేదో తనువంతా తడిముతోంది...
మృత్తిక పరిమళం ముక్కుపుటలు తాకుతోంది...

గ్రీష్మ తాపానికి తల్లడిల్లిన అవని
శీతల సమీరంలో సేదదీరుతోంది...
వడదెబ్బలకు వణికిపోయిన జన సందోహం
వర్షపు జడిలో జలకాలాడుతోంది...

కన్నెర్రజేసిన కిరణమాలి కాస్సేపైనా కనుమరుగయ్యాడు...
ఇంకెతతసేపులే మీ ఆనందమని వెక్కిరిస్తున్నాడు....

Monday 11 April 2016

అలజడి....

మరు కలయిక వీలుకాదని తెలుసు
మరిగిపోయె మనసు మాటవినదనీ తెలుసు
మతిలేని కళ్ళు ఎదురుచూపులు  మానవని తెలుసు
కన్నీటి బరువెంతో కలలుగనే కెలవుకే కదా తెలుసు

వెక్కిరించే విధికి హృది  లేదెందుకో...
అక్కున చెలరేగే అలజడికి లిపిలేదేమిటో...
దక్కని చెలిమి దహించివేస్తోంది
రక్కసిలా రుధిరాశృజలధార కోరుతోంది.. .

నీవు రాజేసిన నిప్పు నివురుచాటున మండుతూనే వుంది...
నీ జ్ఞాపకాల సమీరం తోడై తనువున కాల్చేస్తోంది...  
నీకు దూరంగా నిలువలేని ప్రాణం నలిగిపోతోంది
నేను మేను కాదని నాకిప్పుడే తెలుస్తోంది...  

తరలిపోయిన కాలానికేం తెలుసు
తను తీసుకేళ్ళిన మధుర క్షణాల విలువెంతో... 

Saturday 2 April 2016

ఆనంద లాహిరి

నీ చెలిమి కనుమరుగైతే గమనమెలా నేస్తం...
గుర్తులేదా మన విహంగ విహార  ఆనంద లాహిరి
నిమీలికా నేత్రాల మౌన సంభాషణాఝరి...
నెలవంక సాక్షిగా నీవు చేసిన బాసల విరి

నీ కళ్ళల్లో కనిపించే చిరు నవ్వులే  
దివి విరితోటలోని సిరి మల్లెల పలకరింపులు నాకు.
నీ గల గల మాటల వడి సెలఏరు
మలినమెరుగని మానససరోవరం నాకు... 


మాటవినని మనసును మరలించేదెలా...
మరువలేని నీ జ్ఞాపకాలను తుడిచేసేదెలా...
ప్రకృతే నీవైనప్పుడు నీకు దూరమయ్యేదెలా... 
ప్రవచిత ప్రమాణాలన్ని నీటిమూటలనుకునేదెలా...


గతితప్పిన నీ కఠిన హృది కాస్తైనా కరుగదా
గగనపు అంచులపైకెగసే ఆ మధుర క్షణం తిరిగిరాదా... 
విరిగిన మనసుకు విపణి వీధిలో వెలకడతావా నేస్తం...  
 అనురాగ విలువలను మరచి  వెలివేస్తావా నేస్తం...