Sunday 29 November 2015

అవినీతి వరద.... అంధకార ఎడద

 ప్రకృతి పలకరించిన క్షణం  తనువంతా పరవశం...
పళ్ళుకొరికిని దినం ప్రళయ ఝరిలో విలీనం...
కన్నెర్ర జేసిన కాలమేఘం...  జడివానల నడుమ జనసందోహం...
కానరాని నిగమచాయలు... నడి ముంగిట్లో పలకరిస్తున్న మురికి కాలువలు...
నేరమెవరిది నిఠాలాక్షా... సామాన్యుడికేనా నిరంతరమూ పరీక్ష....
డ్రైనీజిల పైన దర్షనమిస్తాయి ధనవంతుల కట్టడాలు...  
దారితెలియని వరద జలాలకు రహదారులే చిరునామాలు...
                                            పడవలే ప్రధాన వాహనాలు...
వంటకు వనరులు లేవు... కంటికి నిదురలేదు...
                                          కడుపు మంటకు ఊరట లేదు...
సర్పాల బెదిరింపులు... అంధకార రాత్రులు...
కూలిపోతున్న గోడలు... రాలిపోతున్న ప్రాణాలు....
పసిపాపల ఆకలి కేకలు... కన్నవాళ్ళ అరణ్య రోదనలు...
నీళ్ళ మధ్యనే జీవనం... కన్నీళ్ళతోనే తీర్చుకోవాలి దాహం... 
ఎన్నాళ్ళీ పోరాటాలు...  ఆపన్న హస్తాల ఎదురుచూపులు...
అక్రమ ఆక్రమణలు ఆగేదెప్పుడు... అవినీతి పడగలు నేలకూలేదెప్పుడు...
నుదుటి రాత మారెదెప్పుడు... సగటు మనిషి సంతసించేదెప్పుడు...   

Saturday 21 November 2015

మా పల్లె...


చిరుజల్లుల మేఘమాలమేనికెంతమెరుపో...
చినుకు తాకిన పూలరెమ్మకు ఎంతపులకరింపో....
పిల్లగాలుల చిలిపి పలకరింపుతో..  
            మెల మెల్లగా కళ్ళు తెరుస్తోంది మాపల్లె, మగతవీడి......
కోకిలమ్మల శ్రావ్య సంగీతంతో...
            సృతి కలుపుతోంది గిత్త గరళ గజ్జెల చిరు సవ్వడి...
పచ్చని పంట పొలాలు... పొచ్చెమెరుగని పసిడి మనసులు... 
లేత తామరాకు పై కదులుతున్న నీటి చుక్కలు....
హరిత శాఖల నడుమ చిలకల కిలకిలలు...
లలితమయమైన సుందర నందనవనాలు...
గుడిగంటల గణగణలు...
ప్రార్థనా గీతాల సరిగమలు...
మిసిమి నురుగుల సెలయేటి చప్పుళ్ళు...
పొదుగు కొసం లేగదూడల పిలుపులు...
కడుపునిండిన కోడె గిత్తల చిందులు....
ఆదిచూసి ఆనందిస్తున్న గోమాతల గంభీర వదనాలు...
గోధూళి వేళకు రచ్చబండ చెప్పే గుసగుసల ముచ్చట్లు...
ఆడుగడుగునా పరవళ్ళుతొక్కే స్వచ్చమైన చిరునవ్వులు...
కపటమెరుగని పలకరింపులు... కమనీయ స్నేహాలు...
సనాతన సంస్కారాన్ని వీడని వావివరసల తుంటరి చేష్టలు...
ఆత్మీయతలే ఆస్తులుగా మసలుకొనే మమతల లోగిళ్ళు...
అందరిని ఆదరించే ఆనందాల వని...
అమ్మవడిని తలపించే అమృతవర్షిణి ... మాపల్లె... గోపాలుని రేపల్లె...

Friday 6 November 2015

దీపాల వెల్లి... దీపావళి...


దివినుండి దిగివచ్చె కోటి దివ్వెల తల్లి దీపావళి...
దిక్కులన్ని వెలిగించె చిరునవ్వులు వెదజల్లి...
ఎటుచూసినా సంబరాల సందడి... మమతానురాగాల వొరవడి...
కళ్ళు చెదిరే కాంతుల నడుమ పసి పాపల పరవళ్ళు...
కన్నవారి కళ్ళల్లో కదలాడే అనంద బాష్పాలు.... 
ఇన ప్రభను తలపిస్తూ అవని వెలిగి పోతోంది...
చిన్నబొయిన చీకటమ్మ నిలువ చోటులేక చెదరిపోయింది...  
చిటపట చప్పుళ్ళ సరిగమలు.. చిలిపి చేష్టల మధుర క్షణాలు...
పసిడి వన్నెల పందిరిలో ప్రకాశిస్తోంది రిక్కదారి... 
జిలుగు వెలుగుల చీరకట్టి మెరిసిపోతొంది అమావాస్య రాతిరి... 
చెడును చీదరించుకొని తరిమివేస్తే... మంచిని చేరదీసి మసలుకుంటే  
ప్రతిరోజు దీపావళే... పరవశాల పదనిసలే....