Monday, 15 February 2016

నిశిరాతిరి నిరీక్షణ..

నిశి రాతిరి పయనమయ్యా నీ నీడను వెతుక్కుంటూ....
నిను చేరకముందే నీ అడుగుల ఆనవాలు ఆగిపోయిందేమిటి...
నేల తల్లినడిగా నీ వడి వడి నడకల జాడేదని...
నిశిత మౌననమేగాని నోరు విప్పదేమిటి....

అడుగు తడబడుతోంది కరకు రాళ్ళ రహదారిలో
గతి తప్పిన గమనం నీ దరి చేరుస్తుందా...
బ్రతుకు భారమవుతోంది మతి చలించిన మైకంలో
శృతి  లేని జీవితానికి స్వరసురఝరి యోగముందా...  

నా హృది రుధిరబాష్పాలు నీ మది చేరలేదా...
ఈ కాళ రాతిరి నలుపు నీ మనసునలుముకుందా...
నింగినంటే ఆర్తనాదము నీ విగత వీనులకందలేదా...
ఆ అలనాటి అనురక్తి కనుమరుగయ్యిందా...

శిశిర సమీరం తనువు తాకేదెప్పుడు...
సలలిత సరాగం తిరిగి చవి చూసేదెన్నడు...
ఆ అరుణ కిరణం కరుణచూపేక్షణమెక్కడ...
ఈ తిమిర తెర తొలగిపోయెదెప్పటికి...

Saturday, 6 February 2016

వింటున్నావా నేస్తం...



కానరాని తీరం కోసం కన్నీటి కడలిలో పయనిస్తున్నా...
కారుమేఘాల కఠిన గర్జనలకు జడిసి కపోతాన్నై కలవరిస్తున్నా...
చీకట్లో చిరునవ్వులా తోడునిలుస్తావా నేస్తం...
అలసిసొలసిన వదనానికి అరువిస్తావా నీ దరహాసం...

సాగర తిమీరం నడుమ సలలిత సరాగాలు వినిపించేనా...
సమిసిపోయిన సహవాసం కొత్తచిగురు తొడిగేనా...
కాలచక్రం కాస్సేపు ఆపగలవా నేస్తం..
కరిగిపోయిన బాల్యం గుర్తుచేసుకుందాం....    

కాలకాలుని కాలి మంజీర గర్జన
మరలిరాలేని లోకాలకు తరలిపొమ్మంటోంది...
అణువణువున అల్లుకుపోయిన ఆత్మీయ బంధం
విడువనలవికాదు విధినెదురించమంటోంది...

లంగరు లేని నావ లయ తప్పుతోంది...
ఒడుదుడుకుల లాహిరిలో ఒరిగిపోతోంది... 
బడలికసుడిలోనే కనుమరుగవుతానేమొ నేస్తం...
మరుజన్మలోనైన మళ్ళీ కలుసుకుందాం...