Saturday, 25 June 2016

మేఘాలతో చెలిమి చేద్దామా..

తొలకరి జల్లు తాకగానే
విరజిమ్ముతోంది పుడమి పరిమళం
ఎదురు చూస్తున్న నేస్తాన్ని కలిసానన్న పరవశం..
తుళ్ళింతల తనువు తడిసిపొమ్మంటోంది తనివితీరా...

చిన్ని పాపల్లా చెలరేగిపోదామా
చినుకు చినుకును ఒడిసి పట్టుకుందామా...
మేఘాలతో చెలిమి చేద్దామా...
మెరుపుల పందిరికింద ఆడుకుందామా...


Friday, 17 June 2016

నల్ల దొరల శకానికి నాంది పలికాము...



తెల్లోడి పాలనలో తల్లడిల్లిపోతున్నామని
బడుగు జీవుల బలిమి పోగేసి..సుధీర్ఘ సమరమేజేసి 
విగత వీరుల సమాధులపై నల్ల దొరల శకానికి నాంది పలికాము...
స్వేచ్చగా శ్వాసించవచ్చని వెర్రి కలలుగన్నాము...

నడి రాతిరి చీకట్లో నిశాచర తనయులకు పట్టము కట్టాము...
నరాలనే దారాలుగా జేసి స్వేద సుమమాలలను సమర్పించుకున్నాము...
త్యాగధనుల రుధిరాన్నే పన్నీరుగా జల్లి సత్కరించుకున్నాము...
రాబోయే రోజులన్ని మావేనంటూ సంబరాలుజేసుకున్నాము...

ఆరు దశాబ్దాలు దాటినా ఆకలి మంటలు చల్లారలేదు...
అశ్రు నయనాల ఆక్రందనలు ఆలకించే అధిపతి కానరాడు...
తరాలు గడిచిపోతున్నా తలపైన నీడ జాడ లేదు...
వోటు పండుగరోజైనా ఉదరము నిండిందిలేదు...

Tuesday, 7 June 2016

నిలపాలి నీ చూపు నింగి వైపే....

ఇనుప గొలుసులనడిగిచూడు బానిసత్వపు భారమెంతో
తిరగబడ్డ చీమకేతెలుసు స్వాతంత్ర్యపు సుఖమేమిటో
నలిగే బ్రతుకుల్లో ఎముంది దిన దిన గండాలు తప్ప
కళ్ళెదుటే పేరుకుపోయే నిరాశా జీవుల కళేబరాల దిబ్బ

అక్రమార్కుల అధికారం పుట్టింది నీ బానిసగుణం నుండే
భరించే వాడంటే బక్కచిక్కిన దోమకైనా అలుసే
దొరల దౌర్జన్యానికి హడలి పోయి వంగిన తల కన్నా
ఆఖరి నిమిషం వరకు పోరాడి తెగిన తల మిన్న

నిగ్గదీసే వరకే సిగ్గుమాలిన సమాజం బెదిరింపు
ఉరిమి చూశావంటే పరుగుదీస్తుంది పొలిమేరువైపు
ఎన్నాళ్ళు మోస్తావు గరళ కుంభాన్ని వేసారిన కరంకము పైన
చేజారినదెంతో వెనుదిరిగి చూడు ఇప్పటికైనా...

భగ భగ మండే భానుడు సైతం
తొలిసంధ్య నాదేనంటూ తెగ మురిసిపోయినా
నడి నెత్తిన జేరి నాట్యమే జేసినా
మలిసంధ్య ముసుగులో మసకబారి పోడా..తెరమరుగవ్వడా...

పిరికి తాళ్ళు తెంచే ప్రయత్నం  చిన్నదైనా ఫలితం ఓ పెద్ద మలుపే
నేలకొరిగే నిమిషమొచ్చినా నిలపాలి నీ చూపు నింగి వైపే