Monday, 29 August 2016

ఎన్నాళ్ళీ ఒంటరి పయనం నేస్తం ....


పసిడి పండిన భూమి మిసిమి నగవుగోల్పోయి
నడిరాతిరి తిమిరంలో నల్ల దొరల పాలాయె
రతనాలను రాశులుగాపోసిన గతవైభవమంతా
పరదేశ బాంకుల్లో బందీగా స్థిరబడిపోయె

బానిసల వారసులుగా పుట్టి
భరతమాత ఒడిలో పెరిగి
భారమైన మనుగడతో రోసిల్లి
బ్రతుకు తెరువుకై వలస వెళ్ళి

దిక్కు తెలియని చోట కష్టాలు పడుతూ
దినదిన గండంగా రోజులు గడుపుతూ
దినారాల చాటున దు:ఖాన్ని దిగమింగుతూ
దరిజేరలేని తనవాళ్ళ తలపులలో నలిగిపోతూ

ఎన్నాళ్ళీ ఒంటరి పయనం నేస్తం
ఎప్పుడొస్తుందీజీవితాల్లో వసంతం...  

Sunday, 21 August 2016

కోట్ల జతల కళ్ళు కలలెన్నిగన్నా....



జంట అబలల జవ సత్వాలతో
మన జాతి, పతకాల పట్టీలో పేరు నిలుపుకుంది...
అమాత్యులు సమకూర్చిన అరకొర వనరులతో
దేశ ప్రతిష్ఠను మరికొంత దిగజార్చుకుంది...

కోట్ల జతల కళ్ళు కలలెన్నిగన్నా
ఎదలోయలలో ఆశలు ఎంతగా ఎదురుచూస్తున్నా
శతాధికకోట్ల సంతతి ఉన్నా
పసిడి పతకాల సంఖ్య మాత్రం సున్నా

అవని తలమానికం మరోసారి తలదించుకుంది
అవినీతి తిమిరాన్ని అడ్డుకోలేక
అబ్ధుతాలకోసం అలమటించింది
అలనాటి అనుభవాలు గుర్తుంచుకోక

Tuesday, 16 August 2016

మసక చీకటి మాటున కరిగిపోతున్నాను....

అందమైన రహదారిలో అగుపించని ముళ్ళెన్నో
అడుగుతీసి అడుగేసేలోపే మారిపోయే మలుపులెన్నో
గమ్యంవైపే గమనంసాగుతోందనుకున్నాను గాని...
గమనించలేదు విధి త్రవ్విన గోతుల్ని

పడిలేచే కడలి కెరటంలా
పయనం సాగిస్తూనే ఉన్నాను
మలిసంధ్య మగత కిరణంలా
మసక చీకటి మాటున కరిగిపోతున్నాను

కానరాని ఆ కొన కనికరించేదెప్పుడో 
దరిజేర్చుకొని దప్పిక తీర్చేదెన్నటికో
నేలకొరిగేలోపు నిను చేరలేనా
నయననాలు మూతపడక మునుపే నందనము గనలేనా

Tuesday, 9 August 2016

బాసటగా నిలుస్తానని బాసలెన్నోజేశావు

నను తాకే నీ చూపుల్లో ఎప్పుడూ ఒకే ప్రశ్న.. ఎవరునువ్వంటు
గడిచిపోయిన గతంలో ఎక్కడో చూసానంటు...
గగనాన్నీ తాకేలా గళమెత్తి అరవాలనుంది.. నీ గతమంతా నేనేనంటు
నీ నిన్నల్లో నివురునై కలతల నీడల్లో కలిసిపోయానంటు

విత్తంలో విహరించే నీ మత్తైన కళ్ళకు
మసకబారిన నా స్మృతులెలా కనిపిస్తాయి
మలయ మారుతం మోస్తోంది మన మాటలెన్నో
మనసుతో వినిచూడు నీ ఎడద కరుగుతుందేమో

బాసటగా నిలుస్తానని బాసలెన్నోజేశావు
నయనాల నాట్యంతో నిరత హృదిని బలికోరుకున్నావు
మమతానురాగాల మనిషివనుకున్నానేగాని
రుధిర దాహం నిండిన మృగనఖమనుకోలేదు

Monday, 1 August 2016

విరించి రాతల్లో విచిత్రాలెన్నో...

పురుటి నొప్పులను పంటి బిగువున దాచి
తల్లితనం కోసం తనువును తొమ్మిదినెలలు మోసి 
అవని అందాన్నంతా తనయుని మోములోజూసి 
మురిసిపోయిన తల్లి ఎక్కడుందో ఏమో...

చిరుచేతులు గొడవపడుతున్నాయేమో
తోటి జతగాళ్ళతో ఆడుకోనివ్వమని...
పసిమనసు ఎంత పరితపిస్తోందో
వాగ్దేవి వీణాగానం వినాలని...

కమలకరములు కళాత్మకంగా కదులుతున్నాయి..
కనిపెంచిన కడుపు నింపడానికేమో..
ఉదరక్షోభకు వయసు అడ్డురానంటోంది
విరించి రాతల్లో విచిత్రాలెన్నో...