Monday, 28 November 2016

విధి కాటేసిన జీవితాల ఉనికి...



కాలంతో పోటీపడే పరుగుల్లో
పక్కవాడి గోడు పట్టేదవరికి
ఎవరి పయనం ఎందాకో
గమ్యమెరుగని పదములెన్నో

వీధి మలుపుల్లో కనిపిస్తుంది
విధి కాటేసిన జీవితాల ఉనికి
ఎంగిలి విస్తరాకుల వేటలో
మూగజీవులతో ముష్టి యుద్ధం చేస్తూ

అంగారకునిపై ఉన్న ఆసక్తి
ఆకలిమంటల ఆర్తనాదాలపై లేదెందుకో
మన నాయకుల అనురక్తి
అస్మదీయుల అభివృద్దిపైనే ఎందుకో 

Wednesday, 16 November 2016

ముసలి నక్క ముందు మృగరాజు మోకరిల్లినట్టు...



నాల్కలు చాచి నరమేధం కోరుతున్న
తొడెళ్ళ మూకతో శాంతి చర్చలేమిట్రా
అసుర రణనీతికి ఆజ్యంపోస్తున్నా
రాజనీతి నెపంతో సంధి మాటలెందుకురా

సమరంకాని సమరంలో శ్వాసను బలిజేసిన
సిపాయిల శవయాత్రలకు ముగింపు ఎప్పుడురా
తనువు చాలించే తరుణంలో తనయుని గోల్పోయిన
తల్లి నిరాశాశ్రుఝరిని నిలువరించేదెవ్వర్రా

మన తగువు మనుష్యులతో కాదురా
మరో చెంపను జూపడానికి
మలిన మూషకాలతో మంతనాలెందుకురా
ముసలి నక్క ముందు మృగరాజు మోకరిల్లినట్టు

Tuesday, 15 November 2016

Nuvvu Nenu

ఎన్నెన్నో భావాలు నీతోనే మొదలు.....
ఏనాడు కనలేదు ఈ తీపి కలలు....

నా "నువ్వు" నేనంటూ ఊహల్లో చిత్రాలు...
కాదంటూ.. అవునంటూ.. సరసంగా అలకలు...
చూసాను.., విన్నను నీ చిలిపి సైగలు....
నా పెదవిని కదిపెనులే చిరునవ్వై నీ చూపులు......

Kevalam gnapakaalu...

ఎక్కడికి దూరంగా వెలుతున్నావ్......!
నువ్వు ఏ దారి ఎంచుకున్నా తిరిగి నా గుండెనే చేరాలిగా....

ఒక్క సారి సడి చేయక నీ ఊపిరితో లయ కలిపిన నా గుండె సవ్వడి విను,
అది సృష్టించే ప్రతి అలజడి నీ పేరుకు ప్రతిరూపం .......

ఒక్క సారి కన్నులు తెరచి నా మనసులోకి తొంగి చూడు ,
కదిలే ప్రతి ఙ్ఞాపకం నీ నవ్వును చూపిస్తుంది ....

ఒక్క సారి రాత్రి వేల ఆ చందమామను అడిగి చూడు ,
నీ కోసం ఎదురు చూస్తూ తనతో గడిపిన క్షనాలెన్నో...

Wednesday, 9 November 2016

నిశి రెక్కలచాటున తనువుజాలించె ...


 ఓటుకొందామని ఉన్నదంతా వూడ్చేసి బొక్కసం నింపితే
పెద్ద నోటు ప్రాణమిడిచి పీకలదాక ముంచేసె
ఎన్నికల ఎవ్వారం ఎలా సాగుతుందో
ఎదవ రాజకీయం ఏ రూపు దాల్చుతుందో

తిమిరంలో తరలించిన నల్ల ధనమంతా
మురికి కాలువల పాలాయె
లెక్కకందని దొంగనోట్లన్నీ
నిశి రెక్కలచాటున తనువుజాలించె

పన్నెగరేసి పక్కలక్రింద దాచిన విత్తము
పనికిరాని చిత్తుకాగితాల గుట్టగా మారె
నవ్వు ఆగడంలేదు నేనెంత ప్రయత్నిచినా
తేలుగుట్టిన దొంగ మొహముజూడ

Friday, 4 November 2016

రెక్కలొచ్చాయని రాబందులా నువుమారితే

నీతో బాటు కలలనూ గని
పాలల్లో ప్రేమను మేళవించి
నీ పసిగడుపున పోస్తే
పరవషంతో నీపాదాలు
గుండెలపై వేసిన గుర్తులింకా చెరగనేలేదు

పెరుగుతున్న నిను జూసి 
పేదరికాన్ని మరచిపోయి
ఆనందబాష్పాలతో ఆకలిని అణగద్రొక్కి
నీ బుడిబుడి అడుగుల వొరవడిలో గడిపేసిన
మధురక్షణాలింక మరువనేలేదు

రెక్కలొచ్చాయని రాబందులా నువుమారితే 
భవితకు అడ్డుగోడలని భాద్యతలను బలిపెట్టి
అవనిజేర్చిన దేవతలను రహదారిపాల్జేస్తే
బలిసిన నీ మేనూ మలిసంధ్య జేరిననాడు
రేచుక్కలా రాకపోడు నిను రాల్చే ప్రహ్లాదుడు