Friday, 21 July 2017

ఎవరు గీసిన చిత్రాలు...


హరివిల్లు వర్ణాలు
అరుణోదయ కిరణాలు
ఎరుపెక్కిన గగనాలు
ఎవరు గీసిన చిత్రాలు

అందమైన మనసుంటే
అడుగడుగునా ఆనందాలే
ఆలకించే తీరికుంటే
అణువణువు ఆమని ఋతురాగాలే

ఎల్లలులేని ఆకాశం
ఎనభైనాలుగు లక్షల సంతానం
అనుబంధాల చిద్విలాసం
అంతుచిక్కని ఆరాటం

మలచిన శిల్పి ఎవ్వరో
తన మది ఎంత మృదువో
అథిది గృహమే అద్భుతమైతే
అసలు పుట్టిల్లు మరెంత మనోహరమో

Saturday, 8 July 2017

నిన్నల్లో కలసి పోయావు.....


కలలాంటి నీ చెలిమి
క్షణమైనా మరువలేకున్నా  
మళ్ళీ మళ్ళీ తలచుకుంటూ
మదిలోనే కుమిలిపోతున్నా

నా మనసు పిలుపుకు అందనంత దూరం
నక్షత్రాల నడుమ నిలిచింది నీ స్నేహం
నిట్టూర్పుల నీడల్లో వెతుకుతున్నా నీకోసం
నెమరేసుకుంటూ నీ జ్ఞాపకాల తీయని గతం

నాతోనే బ్రతుకన్నావు
నా బ్రతుకే నువ్వయ్యావు
నయనాల బాసలు మరచి
నిన్నల్లో కలసి పోయావు

ఆనంద గీతిక ఆవిరైపోయే
అలసిన మనసేమో నా మాటవినదాయె...

Saturday, 1 July 2017

మనదన్న మాటతో కలసి బ్రతకలేమా



నీదీ నాదన్న తగువెందుకు నేస్తమా 
మనదన్న మాటతో కలసి బ్రతకలేమా
నేలను పంచుకున్నా తీరని దాహమా
నెత్తుటి మడుగుల్లో పైశాచిక నృత్యమా

దేశాన్ని చీల్చావు
ధరణి రంగు మార్చావు
దైవాన్ని కూల్చావు
దానవరాజ్యానికి తెరదీశావు

అలనాటి వైభవం
అరుణోదయమై అరుదెంచేనా
అన్నదమ్ముల నడుమ
అనురాగ విరి విరిసేనా

ఇటుక ఇటుక పేర్చి
ఇళ్ళెన్ని కట్టుకున్నా
విధి పిలుపు రాగానే
వదలి వెళ్ళక తప్పదన్నా