Monday, 18 January 2016

వాడి(మాడి)పోయిన జీవితాలు..






అలసి పోయి వాడినా ఓడిపోని ఆశకు  గుప్పెడంత ధైర్యమిచ్చి గెలుపునివ్వరా......        
ఆకలెంత దాడిచేసినా కన్నీటికి చోటివ్వని పసిమనసునవ్వులకు తోడునిలవరా....      
నువ్వు వేరు,  నెను వేరని సాగిపోతున్న జనం గుండియల తలుపు తట్టి మేలుకొలపరా.....  
దేశం నీది, నాది, మనందరిది...  పరులకంట్లో పలుచున కానివ్వకురా... సోదరా... 

Tuesday, 12 January 2016

సంబరాల సంక్రాంతి

పసిడి పంటల పల్లె ముస్తాబయ్యింది సంక్రాంతి సంబరాలకు
కాయకష్టం కొలిమినుడి కొత్త వెలుగులు నింపుకుంటు...
తెలుగులోగిళ్ళన్నీ ఎదురుచూస్తున్నాయి తనవాళ్ళ రాకకోసం ...  
కనిపెంచినవాళ్ళ కంటి నిరీక్షణనే  కాగడాగా మార్చుకుంటు...   

చిరునవ్వుల గలగలలతో ప్రతిధ్వనిస్తోన్న పల్లె పరవళ్ళు 
గిలిగింతల చలిచెలితో భోగిమంటల దాగుడుమూతలు... 
దివిజుల దీవెనలు మోసుకొచ్చే దినకరుని లేతకిరణాలు...
మంచుతెరల చాటున హరితవనాల మసక సోయగాసాలు...

తెల్లవారకముందే తట్టిలేపె కన్న తల్లుల ప్రేమానురాగాలు...
తుంటరిచేష్టలతో కవ్వించే తరుణీమణుల తన్మయ లీలలు...
పిల్లగాలితో కలిసి పలకరించే తోరణాల సుగంధ పరిమళాలు...
కలిమిలేముల తేడాలెరుగని మట్టి మనుషుల మిసిమి మందహాసాలు...

వేల్పుల నోటను సైతం నీళ్ళూరించే పిండివంటకాల ఘుమఘుమలు...
వీధంతా విరజిమ్మిన రంగురంగుల రమణీయ రంగవల్లులు...
వాటినడుమ వయ్యారంగా కొలువుదీరిన ఘనమైన గొబ్బెమ్మలు...
వీనులవిందైన హరిదాసు కీర్తనలు.. కంటికింపైన గంగిరెద్దుల అలంకారాలు...    

సోమరి సోగ్గాళ్ళ సరసాలు... వరసైన నెరజాణల చమత్కారాలు...
కొసరి కొసరి వడ్డించే సొగసరి మరదళ్ళ చేతి వంటలు...
విరిసిన వదనంతో విందారగించే గడసరి బావలు...
కసిరే చూపులతో ముసలి బామ్మల పరిహాసాలు.. అతివల ఆటవిడుపులు...

పెద్దల దరహాసాలు... పిల్లల సందళ్ళు... అలకలు.. కేరింతలు...
అలసిపోని ఆనందడోలికలు... మన పల్లె పండుగలు...