Thursday, 24 March 2016

మరలిరాని ఆ నిమిషం

తెరమరుగైన  తీయని తలపులను నెమరేసుకుంటే
పలకరించేది వాడిపోయిన వసంతమే
తరలిపోతున్న ఈ క్షణాన్ని ఒడిసి పట్టుకుంటే 
బంగారు భవిత నీ సొంతమే...

కానరాని తీరానికై కలవరించే కన్నా
కడలి నడుమ కెడయికే సుఖమనుకోవోయ్
కరిగిపోయిన కాలంలో విహరించేకన్నా
కళ్ళెదుటనున్న చెలిమి చవి తెలుసుకోవోయ్

మరలిరాని ఆ నిమిషం మనసును మరగిస్తూంటే
విగత గతానికి వీడుకోలు పలికి నవ వసంతాన్ని స్వాగతించవోయ్
చెరిగిపోయిన చిరునవ్వు చితిమంటలను తలపిస్తూంటే
రుధిరాశృ జలధారలో చిత్తాన్ని చల్లారనీయవోయ్

నిశాచరుల నిర్వాకానికి నీ మదిని బలిచేయవద్దు...
నీకోసం ఎదురుచూసే నీవాళ్ళ హృదిని బాధ పెట్టతగదు...
నిన్నటి నీడల్లో రేపటి వెలుగు కానరాదు...
నిష్క్రమించని నేపథ్యం నిలువునా కాల్చక మానదు…

Wednesday, 9 March 2016

పుణ్యభూమి పరిమళం నాదే...

తెల్ల దొరల తలలు తెంచిన టిప్పుసుల్తాను కత్తి పదును నాదే
తల్లి వేంగమాంబ భక్తి ప్రవాహమూ నాదే...
తెలవారిందని తట్టి లేపే రహీము నమాజు నాదబంధము నాదే...
తన్మయ తెరీసా తిరుగాడిన నేల తల్లి నాదే...

అల్లూరి అమ్ము కొనతేజము నాదే...
కనెగంటి హనుమంతు నుదుటి వీరతిలకము నాదే..
నేతాజి సాహసము నాదే.. శివాజి సమర శంఖము నాదే...
మౌలానా సామరస్యము నాదే.. మహాత్ముని సత్య వ్రతము నాదే... 

గిడుగు వారి వడి వడి నడకల తెలుగు నుడి నాదే
గురజాడ నడయాడిన అడుగుజాడ నాదే...
వీరేషలింగం వెలిగించిన జ్ఞాన జ్యోతి నాదే..
వేదవ్యాసుడు ఉదయంచిన   వేద భూమి నాదే...

విభిన్న మతాల వైభవ వేదిక నాదే...
విధినెదురించిన వీరజవానుల రుధిర జలపాతము నాదే...
అన్నమయ్య ఆనంద కీర్తనము నాదే...
అరవిందుని అధ్యాత్మికము నాదే...

ఆకలి తో అలమటించిన ఆర్ద్ర క్షణము నాదే..  
అమ్మ గోరుముద్దల అమృత ఘడియా నాదే...
అలసి ఆదమరచిన అమ్మ ఒడి నాదే...
ఆ అమృతమయి ఆక్రందనా నాదె... అశ్రు ఝరి నాదే..

అనురాగవిరి నాదే.. ఆమె ఆఖరి శ్వాస కూడా నాదే..
కడసారి వీడుకోలు నాదే.. కారుణ్య కిరణము నాదే...  

Saturday, 5 March 2016

మరిచారా నన్ను....?

ప్రతినిమిషం నలిగిపోతున్నా నావాళ్ళకు దూరంగా...
కమనీయ స్నేహాన్ని చంపుకున్నా కడుపు నింపుకోవడమే ప్రధానంగా....
నిన్న నావాళ్ళందరూ నాచుట్టూ ఉన్నారు బ్రతుకుభారమైనా...
నేడు నాకెవ్వరు లేరు డబ్బెంత వెదజల్లినా..

బండరాళ్ళలా బదులుపలకరేమిటి నేనెంత పిలిచినా....
మీ మనసుల్లో నాకు చోటు లేదా నేనెంత దూరంగా వున్నా....
నా సందేశాన్ని అందిచలేదా ఆ నల్లమబ్బు చాటు మెరుపైనా...
అలనాటి ఆప్యాయతలను గుర్తుచేయలేదా ఒక్క క్షణమైనా...  
 
కడలి దాటి వచ్చాను కడుపు చేతపట్టుకొని..
విధి చేర్చిన తీరాలకు కన్నవాళ్ళను కాదని..
నిఠలాక్షుని వేడుకుంటున్నా కరుణించమని...  
కనుమరుగవ్వకముందే నా వాళ్ళ దరికి చేర్చమని..