Wednesday, 9 March 2016

పుణ్యభూమి పరిమళం నాదే...

తెల్ల దొరల తలలు తెంచిన టిప్పుసుల్తాను కత్తి పదును నాదే
తల్లి వేంగమాంబ భక్తి ప్రవాహమూ నాదే...
తెలవారిందని తట్టి లేపే రహీము నమాజు నాదబంధము నాదే...
తన్మయ తెరీసా తిరుగాడిన నేల తల్లి నాదే...

అల్లూరి అమ్ము కొనతేజము నాదే...
కనెగంటి హనుమంతు నుదుటి వీరతిలకము నాదే..
నేతాజి సాహసము నాదే.. శివాజి సమర శంఖము నాదే...
మౌలానా సామరస్యము నాదే.. మహాత్ముని సత్య వ్రతము నాదే... 

గిడుగు వారి వడి వడి నడకల తెలుగు నుడి నాదే
గురజాడ నడయాడిన అడుగుజాడ నాదే...
వీరేషలింగం వెలిగించిన జ్ఞాన జ్యోతి నాదే..
వేదవ్యాసుడు ఉదయంచిన   వేద భూమి నాదే...

విభిన్న మతాల వైభవ వేదిక నాదే...
విధినెదురించిన వీరజవానుల రుధిర జలపాతము నాదే...
అన్నమయ్య ఆనంద కీర్తనము నాదే...
అరవిందుని అధ్యాత్మికము నాదే...

ఆకలి తో అలమటించిన ఆర్ద్ర క్షణము నాదే..  
అమ్మ గోరుముద్దల అమృత ఘడియా నాదే...
అలసి ఆదమరచిన అమ్మ ఒడి నాదే...
ఆ అమృతమయి ఆక్రందనా నాదె... అశ్రు ఝరి నాదే..

అనురాగవిరి నాదే.. ఆమె ఆఖరి శ్వాస కూడా నాదే..
కడసారి వీడుకోలు నాదే.. కారుణ్య కిరణము నాదే...  

No comments:

Post a Comment

Please provide your feedback here.....