Friday, 28 April 2017

చీకటికి ఉనికెక్కడిది నేస్తం....


ఆశనిరాశల అల్లికలే జీవితాలు
మమకారాలన్నీ మాటల మూటలు
అందారూ నీవాళ్ళే అనుకుంటే చాలు
మనసంతా సుగంధ పరిమళాలు

చీకటికి ఉనికెక్కడిది నేస్తం
వెలుగింకా రాలేదన్నదే నిజం
తెలియనిదంతా తిమిరమే కదా
తెలుసుకున్న రోజు తన్మయమే కాదా

నిరాశను జయించిన నాడు
నింగి నీకు తలవంచదా
ఆత్మ విశ్వాసం అంబరమైతే
కురిసే ప్రతి చినుకు అమృతం కాదా

Thursday, 20 April 2017

వేషాలు వేరైనా రుధిర వర్ణం ఒక్కటే .....






కలిచే వేదన ఎవ్వరిదైనా
కన్నీటి చుక్క వెచ్చనేగా
రారాజుకైనా రహదారి బిక్షగాడికైనా
వెన్నెల దీపం చల్లనేగా

నింగికెగిరేదాకా నీ భారాన్ని మోసే
నేల తల్లినడుగు నీ కులమేదని
గతితప్పని గమనంతో నీ ప్రాణాన్ని నిలిపే
గాలి కెరటాన్ని అడుగు నీ కులమేదని

రోదిస్తోంది ప్రకృతి
నిను కన్నందుకు సిగ్గుపడి
రగిలిపోతోంది ప్రళయమై
నీ అజ్ఞానానికి మండిపడి

వర్ణమేదైన వల్లకాడు ఒక్కటే
వేషాలు వేరైనా రుధిర వర్ణం ఒక్కటే

Wednesday, 12 April 2017

కరిగే ప్రతి క్షణం కావ్యమై నిలిచిపోదా ....






ఒడుదుడుకుల కడలిలో
ఎగసిపడే అలల తాకిడిలో
జతకలిసిన నేస్తం నువ్వు
ఎన్నోజన్మల తోడు నీ నవ్వు

మనసు మగత మౌనంలో
మమతల మధుర సడి
ఎదలయలో కలిసిపోయే
నీ ఇరు శ్వాసల చిరు సవ్వడి

కనులముందు నువ్వుంటే
కాలమే ఆగిపోదా
కరిగే ప్రతి క్షణం
కావ్యమై నిలిచిపోదా

Monday, 10 April 2017

ఒంటరిగా పోరడనివ్వు నా ఊపిరాడేవరకు ....


నీకు పట్టనట్టే మసలుకోరా
వగచే జీవితాలు వల్లకాడుజేరేవరకు
నరమేధం జరుగుతున్నా ముసుగుదన్ని నిదురపోరా
వేదన పక్క వాడిది కదా వులికిపాటు నీకెందుకు

మలి వరసలో నీవున్నా
మరో రోజు నీ వంతైన
ఆదుకోవడానికి వున్నారుగా
నువు ఆరాధించే దేవుళ్ళు

పైవాడి పై భారమేసి
ప్రతిఘటన ఊసెత్తకు
పెరుగన్నం నైవేద్యం పెడితే రాడా
పరుగులు పెడుతూ పెరుమాళ్ళు

దీటైన దానవులను వోటేసి ఎన్నుకో
దమన దహనకాండలో సమిధవై వెలిగిపో
ప్రళయ మారుతంలో గడ్డి పరకవై ఎగిరిపో
ప్రశ్నించే గుణం మరచి చరిత్రలో కలిసిపో

గంటకో గండం తలుపుతడుతున్నా
గొంతు విప్పే శ్రమ నీకెందుకు
నాతో చేయి కలపకురా చేవజచ్చిన నేస్తమా
ఒంటరిగా పోరడనివ్వు నా ఊపిరాడేవరకు