Monday, 21 December 2015

హ్యాపి డేస్...

కాలేజి రోజులంటే గిలిగింతల సరాగాలేకదా...
కమనీయ అనుభూతులు.. కవ్వించే కయ్యాలు...
తిరిగిరాని తియ్యదనాలు...  చెరిగిపోని జ్ఞాపకాలు...
గద్దించే గరిమల నడుమ గెలుపోటముల సమాగమాలు..   

ఉరకలేసే ఉత్సాహం.. మైమరిపించే వినోదాల సమాహారం...  
సహచరుల చిద్విలాసాలు.. సమయమెరుగని సయ్యాటలు...
అదుపుతప్పిన అల్లరిమూకల చిలిపిచేష్టలు
ఆగ్రహించిన అధ్యాపకుల మందలింపులు

మరచిపోలేని క్యాంటీను ముచ్చట్లు... 
విదూషక మేధావుల సుదీర్ఘ చర్చలు...
ఆముదాలవలస సమస్యలనుండి...
అమెరికా ఆర్థిక ప్రగతి వరకు...

చంటి గాడి పరిణయ వ్యవహారాల నుండి...
చలం నవలా రమణీయత వరకు... 
అన్ని అజెండాలు మావె.. ఆలకించేవాళ్ళూ మేమే...
సమస్యలన్నీ మావె.. పరిష్కర్తలు మేమే..

చలి చీకట్లలో వెలిగించిన క్యాంప్ఫైర్లు...
క్రీడాసందళ్ళలో గడిపిన సంబరాల క్షణాలు.. 
వినువీధిన ఎగరేసిన విజయ కేతనాలు..  
వీనులవిందైన కరతాళ ధ్వనులు... 

గడచిపోయిన ఆ ఆనంద ఘడియలు తిరిగిరావెందుకు...
కులమతాలు పట్టించుకోని కమనీయ స్నేహాలేమయినాయి...
మమతానుబంధాల మామాఅళ్ళుళ్ళ వరసలు వినిపించవెందుకు..
కరిగిపోయిన కలలు మళ్ళీ పలకరించవేమిటి...

Wednesday, 16 December 2015

మనసా... మారవెందుకే....

అదుపెరుగని పరుగెందుకే అంతుచిక్కని మనసా...
భాష మౌనమేగాని భావనలతో భయపెడతావు...
అందరూ నీవాళ్ళే అనుకుంటావు హద్దులు చెరిపేసుకుంటావు... 
అనుబంధాల నడుమ నలిగిపోయి నవ్వులపాలవుతావు...

గగనమే హద్దుగా ఆత్మీయతను ఆశిస్తావు...
జగమంతా నీలాంటిదేనని నమ్మి చెడతావు...
గాయపడిన క్షణాన మౌనంగా రోదిస్తావు...
కలలెంతమంచివయినా కళ్ళుతెరిచేవరకేనని తెలుసుకోవు...

చేసిన పొరపాట్లు మరచి చెలిమి సాగిస్తావు...
గతించిన గాధలు గుర్తుండవానీకు...
మార్గమెంత క్లిష్టమైనా మరలిరానంటావు...  
అనుభవించిన క్లేశము మరచిపోతావెందుకు...  

చెరిపేసిన జ్ఞాపకాలను నెమరేసుకుంటావు 
మరగించే గాయాన్ని మాసిపోనియ్యవెందుకు...
తెలియని లోకాల్లో షికార్లు చేస్తావు
కల కరిగిపోగానె కన్నీరవుతావెందుకు..

కపటాశ్రువులకు కరగిపోతావెందుకు... 
తలపుల్లోనే వగచి కడదేరుతావెందుకు...
 

Friday, 11 December 2015

మేధావులార మేలుకోండి .....


అవసరాల పేరుతో అవనినే తాకట్టు పెడతామా...
అభివృద్ది మత్తులో మన ఉనికినే తగులబెట్టుకుందామా...
మితిమీరి మండిస్తున్నాము మోటారు ఇంధనం
మలినమైపోతోంది మన అందమైన విశ్వం...

శాస్త్రీయత లోపించిన కర్మాగార నిర్వాహణలు...
సెలఏరులై పారుతున్న పారిష్రామిక వ్యర్థాలు...
నిజాయితి లేని అధికారుల నిర్వాకాలు...
ఇల ఎడద లో ఇంకిపోతున్న రసాయన ప్రవాహాలు...

జీవం కోల్పోతున్న జీవనాధార నదీ జలాలు..
జవసత్వాలుడిగిన జనచైతన్య సంఘాలు... 
కనుమరుగైపోతున్న కమనీయ జీవరాశులు...
గాలిలో పెరిగిపోతున్న గరళ ఝరి అలలు

ఊపిరందని స్తితిలో బాదిత జీవులు...
నిమ్మకునీరెత్తినట్లున్న నిర్జీవ ప్రభుత్వాలు...
వేడెక్కుతోన్న విచలిత వసుంధర
కరిగిపోతున్న శ్వేత శైల పరంపర...

చెట్టు కొట్టేవాళ్ళేగాని నాటి పెంచేవాళ్ళెక్కడ...
మట్టిని నమ్ముకున్న వాళ్ళకు మంచిరోజులెప్పుడు...
గట్టి మేలు తలపెట్టే జట్టి నాయకులెవరు...
మెట్టు దిగని బడాబాబుల మెడలువంచేవాళ్ళెవరు... 

ఆలకించని అసురచేష్టల అగ్రదేశాలు
దడియు వేగంతో దగ్దమవుతోన్న హరిత వనాలు...
హెచ్చరిస్తున్న క్రోధిత కడలిజలాలు..
అంబుధి అంచున హడలిపోతోన్న బడుగు రాజ్యాలు...

కూర్చున్న కొమ్మను నరుక్కునే కుటిల రాజనీతి మారదెందుకు...
మనిషి మనుగడను కోరని మేధావులు మనకెందుకు...