Monday, 21 December 2015

హ్యాపి డేస్...

కాలేజి రోజులంటే గిలిగింతల సరాగాలేకదా...
కమనీయ అనుభూతులు.. కవ్వించే కయ్యాలు...
తిరిగిరాని తియ్యదనాలు...  చెరిగిపోని జ్ఞాపకాలు...
గద్దించే గరిమల నడుమ గెలుపోటముల సమాగమాలు..   

ఉరకలేసే ఉత్సాహం.. మైమరిపించే వినోదాల సమాహారం...  
సహచరుల చిద్విలాసాలు.. సమయమెరుగని సయ్యాటలు...
అదుపుతప్పిన అల్లరిమూకల చిలిపిచేష్టలు
ఆగ్రహించిన అధ్యాపకుల మందలింపులు

మరచిపోలేని క్యాంటీను ముచ్చట్లు... 
విదూషక మేధావుల సుదీర్ఘ చర్చలు...
ఆముదాలవలస సమస్యలనుండి...
అమెరికా ఆర్థిక ప్రగతి వరకు...

చంటి గాడి పరిణయ వ్యవహారాల నుండి...
చలం నవలా రమణీయత వరకు... 
అన్ని అజెండాలు మావె.. ఆలకించేవాళ్ళూ మేమే...
సమస్యలన్నీ మావె.. పరిష్కర్తలు మేమే..

చలి చీకట్లలో వెలిగించిన క్యాంప్ఫైర్లు...
క్రీడాసందళ్ళలో గడిపిన సంబరాల క్షణాలు.. 
వినువీధిన ఎగరేసిన విజయ కేతనాలు..  
వీనులవిందైన కరతాళ ధ్వనులు... 

గడచిపోయిన ఆ ఆనంద ఘడియలు తిరిగిరావెందుకు...
కులమతాలు పట్టించుకోని కమనీయ స్నేహాలేమయినాయి...
మమతానుబంధాల మామాఅళ్ళుళ్ళ వరసలు వినిపించవెందుకు..
కరిగిపోయిన కలలు మళ్ళీ పలకరించవేమిటి...

No comments:

Post a Comment

Please provide your feedback here.....